హైదరాబాద్: శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ఎర్ర జెండాలన్నీ ఏకమవ్వాలి, కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యమైతే రాజ్యం మనదే” అని స్పష్టం చేశారు.
కూనంనేని సాంబశివరావు కమ్యూనిస్టు పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీ శ్రేణులు కంకనబద్దులు కావాలని, గ్రామం గ్రామంలో శాఖలను ఏర్పాటు చేయాలని పిలుపు ఇచ్చారు. “రాజ్యం వచ్చిన తర్వాత కూడా పోరాటాలు కొనసాగుతాయి. కార్మిక రాజ్యం కోసం పోరాటం చేయండి,” అని ఆయన అన్నారు.
సాంబశివరావు మాట్లాడుతూ, “కమ్యూనిస్టు పార్టీ అంటే ఒక పెద్ద కుటుంబం. ధైర్యం, త్యాగం, పోరాటం అన్నింటికి సింబల్ ఒక సంపూర్ణ మనిషి కమ్యూనిస్టు,” అని చెప్పి, పార్టీ శ్రేణులకు ధైర్యం, పట్టుదల కలిగించాలని చెప్పారు.
“కమ్యూనిస్టు చరిత్రే దేశ చరిత్ర!”
కమ్యూనిస్టు చరిత్ర దేశ చరిత్రగా పేర్కొంటూ, “కమ్యూనిస్టులు ఎప్పటికీ ప్రజల హక్కుల కోసం పోరాడారు. 4500 మంది తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులయ్యారు,” అని సాంబశివరావు తెలిపారు.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల కంటే మేథావులు ఉన్న కమ్యూనిస్టు పార్టీ అని చెప్పి, “పార్టీ కోసం ప్రజల మధ్య నిత్యం ఉండాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో సిద్ధంగా ఉండాలని” ఆయన అన్నారు.
శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో పార్టీకి పునరంకింతం కావాలి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, సిపిఐ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, “శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో పార్టీ శ్రేణులు సమరశీల పోరాటాలు నిర్వహించి, కమ్యూనిస్టు పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలి,” అని అన్నారు.
కమ్యూనిస్టు పార్టీ మతోన్మాదాన్ని నిరోధించడంలో క్రీయాశీల పాత్ర
సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ బలహీనపడినా, “మతోన్మాద పార్టీని నిరోధించడంలో సిపిఐ క్రీయాశీల పాత్ర పోషిస్తోంది” అని పేర్కొన్నారు. “భవిష్యత్తులో మతోన్మాద పార్టీలు, జనతాపార్టీ లాంటి రాజకీయ పార్టీలు మాయమయ్యే అవకాశం ఉంది, కానీ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడుతూనే ఉంటుందని,” ఆయన అన్నారు.
సభలో పాల్గొన్న ప్రముఖులు
ఈ సభలో సిపిఐ నాయకులు, ప్రజా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహా తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టుల తాకిడి
కమ్యూనిస్టు పార్టీ తన లక్ష్యాలను సాధించేందుకు, “ఆధికారాలు, సీట్లు వేటి కోసం కాదు, సమసమాజం కోసం పోరాటం చేస్తుంది” అని సాంబశివరావు స్పష్టం చేశారు.