పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసంలో సోదాలు జరగనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విమర్శలకు దారితీసింది.
అతిషి, ట్విటర్ వేదికగా పంజాబ్ ముఖ్యమంత్రి నివాసంలో పోలీసులు సోదాలు జరపడానికి వచ్చారని వెల్లడించారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీజేపీ నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నా, వారికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. “బీజేపీ నేతలు డబ్బు, పాదరక్షలు పంచుతున్నా, వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటిపై సోదాలు జరగడం దారుణం,” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలను వెంటనే ఎన్నికల సంఘం ఖండించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసంలో ఎలాంటి సోదాలు జరగలేదని స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి ఓపీ పాండే వివరిస్తూ, “ఈ ప్రాంతంలో నగదు పంపిణీపై ఫిర్యాదు అందింది. దీంతో, మేము అక్కడ విచారణ చేసి వెనక్కి వచ్చాము,” అన్నారు. సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు అందినట్లు ఆయన తెలిపారు.
ఈ వివరణతో ఎన్నికల సంఘం వ్యవహారం క్లారిటీ సాధించింది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పరిణామం మాత్రం రాజకీయ దాడికి అవకాశాన్ని ఇచ్చింది.