రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)ను ముంబయి అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. 7 సంవత్సరాల క్రితం జరిగిన చెక్ బౌన్స్ కేసు నేపథ్యంలో, కోర్టు ఈ శిక్షను విధించింది. దీంతో ఆర్జీవీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఆర్జీవీ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఆర్జీవీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికపై స్పందిస్తూ, “నా మీద అంధేరి కోర్టు విధించిన శిక్షకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇది 7 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఈ కేసు నా మాజీ ఉద్యోగి మహేష్ చంద్ర కు సంబంధించిన రూ. 2.38 లక్షల చెక్ బౌన్స్ తో సంబంధించింది. నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఇది కోర్టులోనే కొనసాగుతున్న కేసు కావడంతో, నేను దీని గురించి మరింతగా మాట్లాడలేను” అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
కోర్టు తీర్పు ప్రకారం, ఆర్జీవీ మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి (మహేష్ చంద్ర) రూ. 3.72 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిహారం చెల్లించకపోతే, కోర్టు మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
మహేష్ చంద్ర 2018లో వేసిన చెక్ బౌన్స్ కేసులో ఈ తీర్పు వెలువడింది. గత ఏడేళ్లుగా ఈ కేసుపై వాదనలు కొనసాగినప్పటికీ, రామ్ గోపాల్ వర్మ కోర్టులో హాజరుకాలేకపోయారు, దీనితో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఈ శిక్షను విధించింది.
ఈ కేసు, రామ్ గోపాల్ వర్మకు మరింత వివాదాస్పదంగా మారింది, అలాగే ఈ న్యాయ నిర్ణయం సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది.