కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తిరుపతి పరువుప్రతిష్ఠలను దిగజార్చుతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. లడ్డూ విషయంలో చూశాం, మొన్న తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయినప్పుడు చూశాం, ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మేయర్ మీద, కార్పొరేటర్ల మీద, దళిత ఎంపీ మీద దాడులు చేయడం కళ్లారాచూశామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఓవైపు చంద్రబాబు, లోకేశ్ తమకు వైసీపీ నేతలు అక్కర్లేదంటారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్ల మీద, బస్సు మీద, మేయర్ మీద, ఎంపీ మీద దాడులు చేశారు… రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు… కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కళ్లారా చూశాం. ఇవన్నీ కూడా పోలీసులు కళ్లెదురుగానే జరిగాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించి చూస్తుండగానే ఇలాంటి ఘటనలు జరిగాయంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా విఫలమైందో అర్థమవుతోంది.
పవన్ కల్యాణ్ గారూ… తిరుపతిలో మీ జనసేన ఎమ్మెల్యే ఎంత దిగజారిపోయి కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం జరిగిందో ఓసారి గమనించండి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మాకు 93 శాతం సీట్లు వచ్చాయని చంద్రబాబు, లోకేశ్, పవన్ చెబుతున్నారు… మీది ఈవీఎం గెలుపు అని అందరూ అనుకున్నారు. అది నిజం అని ఇవాళ తిరుపతిలో మళ్లీ రుజువైంది.
నిజంగా మీరు ప్రజల ఓట్లతో 93 శాతం సీట్లు సంపాదించి ఉంటే… ఇవాళ ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ విధంగా కిడ్నాప్ చేసి, రౌడీయిజం చేయాల్సిన అవసరం ఉందా? మీకు దమ్ము, ధైర్యం ఉంటే… ప్రజలు మీ పక్షాన ఉన్నారు అనుకుంటే… ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అని మీ ప్రభుత్వం అనుకుంటుంటే… ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి, మీ గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకుంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని శెభాష్ అంటారు.
కానీ, ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళ అని కూడా చూడకుండా మేయర్ ని ఏవిధంగా వేధిస్తున్నారు, ఆమె మీద ఎలా దాడులు చేస్తున్నారు, ఒక దళిత ఎంపీ గురుమూర్తిపై ఎలా బూతులు తిడుతూ దాడి చేస్తున్నారో టీవీల్లో అందరూ గమనిస్తున్నారు.
ఈ ఏడు నెలల కాలంలో మీరు విఫలం అయ్యారు… ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారని తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు చేయాలనుకోవడం నిజం కాదా?” అంటూ రోజా నిప్పులు చెరిగారు.