బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి, రేపు ఇందిరాపార్క్ వద్ద బీసీ మహాసభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈ సభను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభ నిర్వహణను అడ్డుకోవద్దని ఆమె కోరారు.
బీసీ మహాసభలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి డిమాండ్లు ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా కవిత ఇప్పటికే బీసీ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. మహాసభ పోస్టర్‌ను కూడా ఇటీవల విడుదల చేశారు.
అయితే, సభ నిర్వహణకు ఇప్పటి వరకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. గురువారం ఉదయం నుంచి సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద తెలంగాణ జాగృతి ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు అనుమతి కోసం వేచి చూస్తున్నారు.